prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 6:18 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి, మండల వ్యవసాయ అధికారి

పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి: మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి

బీర్కూర్: రాబోయే యాసంగి 2026-27 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బీర్కూర్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి సూచించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నందున ఈసారి పంటల సాగులో మార్పులు చేసుకోవాలని ఆమె రైతులకు పిలుపునిచ్చారు.

సాధారణంగా వరి సాగుకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుందని, రాబోయే యాసంగిలో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ముఖ్యంగా రాగి, వేరుశెనగ, కూరగాయలు, పశుగ్రాసం, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.

రైతులు వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, భూమి స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. అధికంగా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీర్కూర్ మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులు వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి కోరారు. పంటల మార్పిడితో పాటు నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె తెలిపారు.