*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ*
* *మన ప్రజావాణి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉపజిల్లా అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్ కుమార్ కలిసి ఈ నెలలో నిర్వహించనున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా నవంబర్ 12 నుండి నిమోనియా నివారిద్దాం, చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో అవగాహన, వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. నిమోనియా 5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుందన్నారు. దగ్గు, కఫం, జ్వరం, జలుబు, వేగంగా శ్వాసించడం, శ్వాసించేటప్పుడు పక్కటెముకలు కదలడం, ఛాతీ లోనికి వెళ్లడం, పాలు తాగలేకపోవడం, నీరసం, పెదవులు, నాలుక నీలంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కనిపిస్తే వెంటనే ఆరోగ్య కార్యకర్తకు లేదా పిహెచ్సి కి తీసుకెళ్లాలని, ఇంటి వద్ద వైద్యంతో సమయం వృథా చేయవద్దను సూచించారు. నిమోనియా నివారణకు 6 నెలల వరకు తల్లిపాలు, సరైన సమయంలో టీకాలు, పరిసరాల పరిశుభ్రత, చలికాలంలో వెచ్చని బట్టలు, చేతులు సబ్బుతో కడుక్కోవడం చేయాలని సూచించారు. నిమోనియా ఊపిరితిత్తుల గాలి సంచుల్లో ద్రవం, చీము చేరి శ్వాస ఇబ్బంది కలిగించే వ్యాధి అని, బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వస్తుందని, దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు నవంబర్ 15 నుండి 21 వరకు ప్రతి నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ప్రారంభం, ఉజ్వల భవిష్యత్తుకు బలం అనే నినాదంతో అన్ని పిహెచ్సి, సిహెచ్సి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆశా కార్యకర్తల ద్వారా తల్లులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పుట్టిన బిడ్డకు గంట లోపు ముర్రుపాలు పట్టించాలని, 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. కంగారూ కేర్ ద్వారా వెచ్చదనం కల్పించడం తోపాటు సకాలంలో టీకాలు, సురక్షిత నిద్ర, పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలు, ప్రమాద సూచికలు గుర్తించి వైద్యులకు చూపించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సిహెచ్ఓ లు కాకిరాల వెంకటేశ్వర్లు, నామ్దేవ్, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఆర్ఎస్ పద్మ, శంకర్, రవి, వైద్యులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.