కొబ్బరికాయ కొట్టి వెళ్లడమేనా.. రైతుల వడ్లు కొనేదెప్పుడు?
నెల రోజులుగా బెజ్జంకి మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపులు
మిల్లుల కేటాయింపు లేక నిలిచిన కొనుగోళ్లు.. దళారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి)
ధాన్యం కొనుగోళ్ల ప్రారంభోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించినా క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి వ్యవసాయ మార్కెట్లో నెల రోజుల క్రితమే ధాన్యం పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు సేకరణ ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారే తప్ప, ఆ తర్వాత రైతుల ధాన్యం కొనుగోళ్లపై పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు మిల్లుల కేటాయింపు జరగకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నిలిచిపోయిందని రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత శ్రీశైలం ఆరోపించారు.
మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. బెజ్జంకి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని సైతం రైతులు తిరిగి బయటకుతరలించుకుపోతున్నారని తెలిపారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడం దురదృష్టకరమన్నారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మిల్లుల కేటాయింపులు పూర్తి చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మిల్లుల కేటాయింపులు పూర్తి చేయాలని, బెజ్జంకి మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి అన్నదాతలకు న్యాయం చేయాలని శ్రీశైలం డిమాండ్ చేశారు.