prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 2:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో ప్రమాదకరంగా మారిన కల్వర్టు!స్లాబ్ పూర్తిగా ధ్వంసం. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల ఆందోళన

పోరుమామిళ్ల,నవంబర్ 17(ప్రజావాణి న్యూస్) పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో ఉన్న కల్వర్టు స్లాబ్ పూర్తిగా పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై కల్వర్టు దెబ్బతిని పెద్ద గుంత ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై వెళ్లే వాహనదారులకు ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇదే రోడ్డులో పాఠశాల బస్సులు సైతం రాకపోకలు సాగిస్తుండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు!

శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులోని కల్వర్టు పరిస్థితి చూస్తే అధికారుల పర్యవేక్షణ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు పైభాగంలోని స్లాబ్ పూర్తిగా పగిలిపోవడంతో లోపల ఉన్న చెత్తాచెదారం బయటకు కనిపిస్తోంది. చుట్టుపక్కల రాళ్లు,మట్టి పేరుకుపోయి రహదారి కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది,రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాల బస్సుల రాకపోకలు.విద్యార్థుల ప్రాణాలకు ముప్పు!

ఇదే రహదారిపై ప్రతిరోజూ పాఠశాల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కల్వర్టు స్లాబ్ పగిలిపోయి ప్రమాదకరంగా మారినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.భారీ వాహనాలు,ఆటోలు,ద్విచక్ర వాహనాలు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు కల్వర్టు గుంతలో పడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులను తీసుకెళ్లే పాఠశాల బస్సుల విషయంలో అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. పంచాయతీ పన్నుల వసూళ్లలో ముందుంటారు.. అభివృద్ధి పనుల్లో వెనుకబడతారా?స్థానిక ప్రజల నుంచి పంచాయతీ పన్నులు,ఇంటి పన్నులు ఇతర రుసుములు వసూలు చేయడంలో అధికారులు ముందుంటారని,కానీ ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రజలు పన్నులు చెల్లిస్తున్నది మెరుగైన రహదారులు,సురక్షితమైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రమాదరహిత రాకపోకలు వంటి సదుపాయాల కోసమేనని గుర్తుచేస్తున్నారు.పన్నులు వసూలు చేసినప్పుడు చూపించే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలోనూ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా?

కల్వర్టు పరిస్థితిని చూస్తుంటే అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కరించడం అధికారుల బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు.సంబంధిత పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి కల్వర్టుకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులోని పాడైన కల్వర్టును వెంటనే పరిశీలించి, తాత్కాలికంగా ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యతతో కూడిన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అలాగే రహదారిపై ఉన్న రాళ్లు, చెత్తాచెదారాన్ని తొలగించి వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆవేదన ఒక్కటే.ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు.ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని సమస్యను పరిష్కరించాలి!