prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:10 am Digital Edition : PRAJA VANI

శివనగర్ ప్రజల గోడు.. కమిషనర్‌కు బీజేపీ వినతి.. సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ!

**శివనగర్ ప్రజల గోడు.. కమిషనర్‌కు బీజేపీ వినతి.. సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ!**

వరంగల్: శివనగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

బీజేపీ శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

శివనగర్ ప్రాంతంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని, ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు, పొదలు పెరగడం వల్ల దోమల ఉత్పత్తి అధికమవుతోందని నాయకులు తెలిపారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అదేవిధంగా కోతులు ఇళ్లలోకి చొరబడి ప్రజలపై దాడులకు పాల్పడటంతో పాటు నిత్యావసర వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, వీధి కుక్కల బెడద కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించాలని, కోతులు మరియు వీధి కుక్కల సమస్యకు తగిన పరిష్కారం చూపాలని కోరారు.

ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శివనగర్ మండల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కన్వీనర్ కందుకూరి విజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, 34వ డివిజన్ కన్వీనర్ సతీష్ పోశాల తదితరులు పాల్గొన్నారు.