prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 4:59 pm Digital Edition : PRAJA VANI

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన

– దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతల విమర్శ
– మోదీ పాలనలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
– రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లా మనోహర్ రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 17 :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాల సరసన ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లా మనోహర్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఎదుట బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్లా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పాలనలో పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఈ ప్రగతిని ఓర్వలేకే రాహుల్ గాంధీ దేశంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ శక్తులు, తీవ్రవాద, అసాంఘిక శక్తులతో చేతులు కలిపి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌లో భారత్ సమిట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విదేశీయులతో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేయించడం దేశ గౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష నెరవేరకపోవడంతోనే రాహుల్ గాంధీ దేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడటం తగదన్నారు.

ప్రధాని మోదీ పాలనలో రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం, రేషన్ ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసినప్పుడు ఒక విధంగా, తాము నిరసన తెలిపినప్పుడు మరో విధంగా పోలీసులు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని సహించబోమని, ఈ విషయంపై త్వరలో పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వివిధ మండలాల పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎలాంటి కేసులు నమోదు చేయకుండా బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జపతి రాజేశం, ఉమేష్, బతుల రాజు, భూషణవేణి మనోహర్, ఎల్లండుల శ్రీనివాస్, దేవ ప్రదీప్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.