*ముధోల్లో బీజేపీ, కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు!*
*తానూర్, కుభీర్ మండలాల్లో పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, కీలక నేతలు గులాబీ గూటికి.. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక.. చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 17:-
ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయా పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తానూర్, కుభీర్ మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి డాక్టర్ పి. రమాదేవి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు.కుభీర్ మండల పరిధిలోని మాలేగాం, సాంవ్లీ, అంతర్ణి, పల్సి గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులతో పాటు సిర్పెల్లి గ్రామ ఉప సర్పంచ్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా తానూర్ మండల పరిధిలోని హంగిర్గా, దహాగాం, ఎల్వీ, జౌళ (బి), తొండాల, వడోనా, సింగన్గావ్ గ్రామాల సర్పంచులతో పాటు జౌళ (బి), మహలింగి, ఎల్వీ గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరడం ముధోల్ నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
డాక్టర్ పి. రమాదేవి చొరవతో తానూర్, కుభీర్ మండలాల్లో చోటుచేసుకున్న ఈ చేరికలు రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.