prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 10:20 am Digital Edition : PRAJA VANI

ప్రేమ పేరుతో వేధింపులు.. 17 ఏళ్ల విద్యార్థిని మృతి!

ప్రేమ పేరుతో వేధింపులు.. 17 ఏళ్ల విద్యార్థిని మృతి!

ముగ్గురిపై పోక్సో కేసు నమోదు

– వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన బాలిక
– మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
– బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్
– మైనర్ బాలికల భద్రతపై మరోసారి ఆందోళన

చిన్నంబావి ప్రజావాణి నవంబర్ 16

చిన్నంబావి: ప్రేమ పేరుతో వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 17 ఏళ్ల విద్యార్థిని వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (నవంబర్ 16) మధ్యాహ్నం మృతి చెందింది. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని స్వగ్రామానికి వచ్చిన బాలిక విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

చదువులో చురుకైన విద్యార్థిని..

దగడపల్లి గ్రామానికి చెందిన బాలిక తుర్కయంజాల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం పెబ్బేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అప్రెంటిస్‌కు సంబంధించిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటోంది. అయితే స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఎదురైన పరిణామాలు ఆమె జీవితాన్ని విషాదాంతం చేశాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రేమ పేరుతో వేధింపుల ఆరోపణలు..

అదే గ్రామానికి చెందిన బోయ రాఘవేందర్‌తో పాటు కుర్వ శేషయ్య, సాకలి రామస్వామి అనే ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు, ఒత్తిళ్లు భరించలేక ఈ నెల 8వ తేదీన బాలిక క్రిమిసంహారక మందు సేవించినట్లు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు నవంబర్ 16న కన్నుమూసింది.

ముగ్గురిపై పోక్సో కేసు నమోదు..

ఈ ఘటనపై చిన్నంబావి పోలీసులు స్పందించారు. బాలిక మృతికి సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపారు. ఘటనపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బాధ్యులకు కఠిన శిక్ష పడాలి..

తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను వేధించడం, వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే కుటుంబానికీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలికల భద్రతపై ప్రశ్నార్థకం..

చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన ఓ బాలిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలచివేస్తోంది. బాలికల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడే వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మైనర్ బాలికల భద్రతకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వేధింపులపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా విచారణను వేగవంతం చేసి, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.