prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:42 am Digital Edition : PRAJA VANI

పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్

పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్ హాల్‌లో నారాయణఖేడ్ మండలానికి చెందిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు అధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరు కాగా, జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి అత్యధికంగా పెన్షన్లు మంజూరు కావడం విశేషమన్నారు. నారాయణఖేడ్ మండలానికి మొత్తం 584 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంకా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆదేశించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, పేద ప్రజల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల అవసరాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.