prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో నిలువు దోపిడీ

*పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో నిలువు దోపిడీ*

*అదనపు వసూళ్లపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి*

* *మన ప్రజావాణి* *మందమర్రి:-*

పట్టణంలోని చైతన్య ఉన్నత పాఠశాల యాజమాన్యం పదవ తరగతి పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, నిలువు దోపిడి చేస్తుందని సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ ఆరోపించారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు కు వినతిపత్రం సమర్పించి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుర్గరాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు కేవలం 125 రూపాయలు ఫీజు నిర్ణయించగా, పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా 1,000 రూపాయలు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అదనంగా గుంజుతున్న 875 రూపాయలు ఏ లెక్కన వసూలు చేస్తున్నారో బహిర్గతం చేయాలని, అక్రమ వసూళ్ల రసీదులను తక్షణమే పరిశీలించాలని కోరారు. 80 శాతం పాఠశాల ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే ఎస్ఎస్సి పరీక్ష ఫీజు స్వీకరిస్తామని యాజమాన్యం అమానుషమైన షరతులు విధిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలను మానసిక, ఆర్థిక వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యూషన్ ఫీజు బకాయిలను బోర్డు పరీక్ష ఫీజుతో ముడిపెట్టే దుశ్చర్యను తక్షణమే నిలిపివేయించాలని కోరారు. ఫీజు వివాదాల కారణంగా ఏ ఒక్క విద్యార్థి పరీక్షలకు దూరం కాకుండా రక్షణ కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.