గుంటూరు,నవంబర్ 16:ప్రజావాణి సమాజమే కుటుంబంగా భావిస్తూ నిరుపేదలు,అభాగ్యులు,వృద్ధులు, నిరాశ్రయుల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు,మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.ఆయన అందిస్తున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా జాతీయ సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరించాయి.అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకుల 8వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులోని రెవెన్యూ ఫంక్షన్ హాల్లో వ్యవస్థాపక అధ్యక్షులు కొడవటికంటి బాలరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు సేవా ప్రముఖులను సత్కరించారు. ఇందులో భాగంగా డాక్టర్ మల్లాది ప్రసాదరావు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ సేవారత్న అవార్డును ప్రదానం చేశారు.మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లాది ప్రసాదరావు ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పేదలు, నిరుపేద కుటుంబాల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య సహాయం అందించడం, చలికాలంలో నిరాశ్రయులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.అలాగే నిరాదరణకు గురైన వృద్ధులు, వితంతువులకు వస్త్రదానం,నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం,విద్యార్థులకు విద్యాధనం,పేద పిల్లలకు విద్యా ప్రోత్సాహం,పేదలకు దుస్తుల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.కుల,మత,ప్రాంతీయ భేదాలకు అతీతంగా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే మదర్ సర్వీస్ సొసైటీ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ సందర్భంగా జాతీయ సేవారత్న అవార్డు అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ.ఈ అవార్డు తనపై మరింత సామాజిక బాధ్యతను పెంచిందన్నారు.నవభారత నిర్మాణంలో భాగంగా పేదరికం లేని సమాజం కోసం,నిరుపేదలకు అండగా నిలుస్తూ తన శక్తి వంచన లేకుండా నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. అవార్డులు వ్యక్తిగత గౌరవాలే కాకుండా సమాజానికి మరింత సేవ చేయడానికి ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.స్వచ్ఛంద సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న సేవకులను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులతో సత్కరిస్తున్న కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొడవటికంటి బాలరాజుకు, వారి బృంద సభ్యులకు డాక్టర్ మల్లాది ప్రసాదరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సేవే జీవన మార్గంగా.. సమాజమే కుటుంబంగా భావిస్తూ సాగుతున్న మదర్ సర్వీస్ సొసైటీ సేవా ప్రయాణానికి జాతీయ సేవారత్న అవార్డు మరో మైలురాయిగా నిలిచింది. సేవరత్న అవార్డు అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావును ఎన్జీవో సంస్థలు,సామాజిక కార్యకర్తలు, ప్రముఖ నాయకులు, గ్రామ పెద్దలు,జర్నలిస్టులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.