prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 7:09 pm Digital Edition : PRAJA VANI

షాద్ నగర్ ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థి ప్రణయ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ఏఐఎస్ఎఫ్

*షాద్ నగర్ ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థి ప్రణయ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ఏఐఎస్ఎఫ్*

*​మృతుడి తల్లికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలి*

*​అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు తక్షణమే సొంత ప్రభుత్వ భవనాలు నిర్మించాలి*

*​బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి*

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్*

షాద్నగర్ న్యూస్ 16​(మన ప్రజా వాని )

షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ ప్రథమ సంవత్సరం (ఫస్ట్ ఇయర్) చదువుతున్న ప్రణయ్ అనే విద్యార్థి, నిన్న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో హాస్టల్ నుండి బయటకు క్యాటరింగ్ పనికి వెళ్లి తిరిగి రావడం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుడు ప్రణయ్ కుటుంబానికి ఏఐఎస్ఎఫ్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
​ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మాట్లాడుతూ, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను బలోపేతం చేస్తున్నామని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక్క హాస్టల్‌కు కూడా సొంత ప్రభుత్వ భవనం లేకపోవడం దారుణమన్నారు. అన్ని ప్రభుత్వ హాస్టళ్లు ప్రైవేట్ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, కనీసం విద్యార్థులు సమయానికి హాస్టల్‌కు వస్తున్నారా? చదువుకుంటున్నారా? అని పర్యవేక్షించడానికి వాచ్‌మెన్ (సెక్యూరిటీ) కూడా లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే నేడు ఒక నిండు ప్రాణం బలైందని, ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుడు ప్రణయ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి వారి తల్లికి తక్షణమే ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కేటాయించాలి అని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి షాద్ నగర్‌లో ప్రైవేట్ అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత ప్రభుత్వ భవనాలు నిర్మించాలి. ప్రతి హాస్టల్‌కు తప్పనిసరిగా వాచ్‌మెన్ (సెక్యూరిటీ) నియమించాలి.
విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత హాస్టల్ వార్డెన్‌పై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించి, తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

​ 18 సంవత్సరాలు నిండని మైనర్ విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ పనులకు తీసుకెళ్తున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. చైల్డ్ లైన్ (1098) మరియు సంబంధిత అధికారులు ఈ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలి.
​ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రభుత్వం మేల్కొని హాస్టళ్ల పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో షాద్ నగర్ వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆకాష్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు… నరేష్ శ్రీహరి, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.