prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:35 pm Digital Edition : PRAJA VANI

విధి నిర్వహణలో నిర్లక్ష్యం విద్యుత్ శాఖ ఏఈపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు

*విధి నిర్వహణలో నిర్లక్ష్యం విద్యుత్ శాఖ ఏఈపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు*
.జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

మంత్రి సీతక్క నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ములుగు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషనల్) బానోతు రవిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ములుగు ఎంపీడీవో ముందస్తు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారిక కార్యక్రమానికి ఆటంకం కలగడంతో పాటు మంత్రి, ప్రజల సమక్షంలో జిల్లా యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయడంలో, కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచడంలో ఏఈ బానోతు రవి విఫలమయ్యారని తెలిపారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.