prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:23 pm Digital Edition : PRAJA VANI

మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు గానుగ ప్రారంభం

మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు గానుగ ప్రారంభం

రైతుల శ్రేయస్సును కాంక్షిస్తూ సుదర్శన హోమం

నష్టాలు వస్తున్నా రైతుల కోసమే కర్మాగారం నిర్వహణ – మాజీ ఎంపీ నామ

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్మాగారంలో 2026–27 చెరకు గానుగ సీజన్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన సతీమణి చిన్నమ్మతో కలిసి ఉదయం 9.54 గంటలకు చెరకు గడలను గానుగలో వేసి సీజన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన గానుగ సీజన్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం కర్మాగారం జోన్ పరిధిలోని చెరకు రైతులు, వివిధ రైతు సంఘాల నాయకులతో నామ మాట్లాడుతూ రైతులతో కర్మాగారానికి ఉన్న అనుబంధాన్ని, చెరకు సాగులో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర పరిశ్రమ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. అనేక ఆర్థిక, నిర్వహణపరమైన సవాళ్లు పరిశ్రమల మనుగడకు ఇబ్బందిగా మారుతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కర్మాగారానికి సహకరించాలని కోరారు. రైతులు, పరిశ్రమ పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మధుకాన్ కర్మాగారం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులను ఈ సందర్భంగా రైతులకు వివరించారు. మొత్తం 26 సంవత్సరాల నిర్వహణలో కోజనరేషన్ విద్యుత్ ఉత్పత్తి విభాగంలో రెండేళ్లు, చక్కెర ఉత్పత్తి విభాగంలో మరో రెండేళ్లు మాత్రమే లాభాలు వచ్చాయని, మిగిలిన 22 సంవత్సరాలు నష్టాలను ఎదుర్కొంటూనే కర్మాగారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక చక్కెర కర్మాగారాలు నష్టాలను భరించలేక మూతపడిన విషయాన్ని గుర్తుచేశారు. చక్కెర పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో రైతులకు అందుబాటులో ఉండి, వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మధుకాన్‌ను కొనసాగిస్తున్నట్లు వివరించారు. తన తండ్రి స్వర్గీయ ముత్తయ్య కూడా రైతేనని, తాను సైతం రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని నామ తెలియజేశారు. రైతుల కష్టాలు, వారి జీవన పరిస్థితులు తనకు తెలుసని, రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతోనే ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. కర్మాగారాన్ని నిర్వహించడం వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదని, రైతులకు మేలు జరగాలనే ప్రధాన ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. చెరకు రైతులకు కర్మాగారంతో ఉన్న అనుబంధం ఎంతో కీలకమని, రైతుల సహకారం, సిబ్బంది అంకితభావం పరిశ్రమ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. ఈ గానుగ సీజన్‌లో అందరూ సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. గానుగ ప్రారంభోత్సవం తర్వాత నామ దంపతులు చెరకు రైతులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా నామ స్వయంగా రైతులకు అల్పాహారం వడ్డించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. రైతులతో మమేకమై అల్పాహారం స్వీకరించిన నామ వారితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

అనంతరం రైతులు, కర్మాగార సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రత్యేకంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పలువురు పాల్గొని పూజలు నిర్వహించారు. హోమం ముగిసిన అనంతరం పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నామ కుటుంబ సభ్యులు, సంస్థ ఏవిపి కోటయ్య, శ్రేయోభిలాషులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, చెరకు రైతులు, కర్మాగార అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.