*ప్రజావాణి కథనంతో కదిలిన పంచాయతీ..! పెద్ద శంకరంపేటలో కాలుష్య కోరలకు చెక్..! అధికారులకు ప్రజల కృతజ్ఞతల వెల్లువ..!*
*చికెన్ వ్యర్థాలు వేస్తే గ్రామపంచాయతీ అధికారులురూ.5000 జరిమానా వేయాలని ప్రజల డిమాండ్..!*
*పెద్ద శంకరంపేట: ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు*
ప్రజల గోసను అక్షరాల్లో చూపిన ప్రజావాణి న్యూస్ కథనానికి గ్రామ పంచాయతీ అధికార సిబ్బంది తక్షణమే స్పందించారు. *”పంచాయతీ నిర్లక్ష్యంతో పెద్ద శంకరంపేటలో కాలుష్య కోరలు”* అనే కథనం ప్రచురితమైన వెంటనే పంచాయతీ యంత్రాంగం రంగంలోకి దిగి, గ్రామాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను పూర్తిగా పరిష్కరించింది. దీంతో గ్రామస్తులు సంతోషంతో పంచాయతీ అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
*ఎన్నాళ్ల నరకమో..!*
పెద్ద శంకరంపేట గ్రామంలో చెత్త వేసేందుకు సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో చెరువు కట్ట, రోడ్డు పక్కన ఖాళీ స్థలం చెత్త కుప్పగా మారిపోయింది. ఇంటి చెత్త, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, పండ్ల తొక్కలు, చికెన్ వ్యర్థాలు అన్నీ అక్కడే పడేసేవారు. కొందరు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ వ్యాపించి, ఆ ప్రాంతం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
ఆ దారి గుండా వెళ్లాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. ఇళ్లలో ఉండలేని దుర్వాసన, దోమలు, ఈగల బెడద. పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వ్యాపారులు దుకాణాలు తెరవలేని పరిస్థితి. ప్రయాణికులు ఆ దారిలో నడవడానికి కూడా భయపడేవారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే వారు లేరు.
*ప్రజావాణి కథనం – ప్రజల గెలుపు..!*
ఈ సమస్యను ప్రజావాణి న్యూస్ ఫోటోలతో సహా ప్రత్యేక కథనంగా ప్రచురించింది. ప్రజల బాధను యథాతథంగా చూపించింది. కథనం చూడగానే గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.
పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బంది జేసీబీలు, ట్రాక్టర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా శ్రమించి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను కూడా తొలగించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు.
*ఇప్పుడు ఆ ప్రాంతం చూస్తే..!*
ఇన్నాళ్లు చెత్త కుప్పగా, దుర్వాసనతో నిండిపోయిన ఆ స్థలం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఖాళీగా, శుభ్రంగా, చూడచక్కగా కనిపిస్తోంది. దుర్వాసన పోయింది, పొగ మాయమైంది, స్వచ్ఛమైన గాలి వీస్తోంది. ఆ దారి గుండా వెళ్తున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు.
*”మా మాట విన్నారు.. ధన్యవాదాలు” – గ్రామస్తుల కృతజ్ఞతలు..*
“ఎన్నాళ్లుగానో మేము పడుతున్న బాధను ఎవరూ పట్టించుకోలేదు. ప్రజావాణి న్యూస్ లో వార్త రాగానే అధికారులు వెంటనే స్పందించారు. మా గ్రామాన్ని శుభ్రం చేసిన పంచాయతీ అధికారులకు, సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా గోస పట్టించుకున్నందుకు ధన్యవాదాలు” అని గ్రామస్తులు, మహిళలు, వృద్ధులు, వ్యాపారులు అంటున్నారు.
“ఇలాగే ఎప్పుడూ మా సమస్యలను పట్టించుకోవాలని కోరుకుంటున్నాం” అని వారు తెలిపారు.
*చికెన్ వ్యర్థాలు వేస్తే రూ.5000 జరిమానా వేయాలని ప్రజల డిమాండ్..!*
శుభ్రం చేసిన ప్రాంతంలో మళ్లీ చెత్త వేయకుండా గ్రామస్తులు పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇప్పటి నుంచి ఎవరైనా చికెన్ వ్యర్థాలు, పదార్థాలు రోడ్డు పక్కన, చెరువు కట్టపై వేస్తే రూ.5000 జరిమానా విధించాలంటు గ్రామస్తులు పంచాయతీ అధికారులను కోరారు. దీనిపై కఠినంగా వ్యవహరించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
అలాగే చెత్త కోసం శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ పరిశుభ్రత అనేది కేవలం పంచాయతీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని, చెత్తను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వేయకుండా పంచాయతీ చెత్త వాహనాలకే అందించాలని అధికారులు ప్రజలను కోరారు.
ప్రజల సమస్యను వెలుగులోకి తెచ్చిన ప్రజావాణి న్యూస్ కు కూడా గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.