పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత
– నిరుపేద యువతి వివాహానికి మెట్టెల బహూకరణ
– 13వసారి పేద కుటుంబానికి ఆర్థిక చేయూత
షాబాద్, ప్రజావాణి నవంబర్ 16:
పేద ప్రజలకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా 13వసారి మరో నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. రుద్రారం గ్రామానికి చెందిన మంగలి జంగయ్య కుమార్తె వివాహం సందర్భంగా ఆమెకు మెట్టెలను బహూకరించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు కష్టసమయంలో అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. ఆడంబరాలకు దూరంగా నిరుపేదలకు చేతనైన సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పేద కుటుంబాలకు తన సహాయ సహకారాలు కొనసాగిస్తానని తెలిపారు.
పేదల కష్టాల్లో పాలుపంచుకుంటూ వరుసగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డిని ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు.