prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:31 pm Digital Edition : PRAJA VANI

పేకాట స్థావరంపై సీఐ ఎ. మహేందర్ ఆకస్మిక దాడి.. ఐదుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై సీఐ ఎ. మహేందర్ ఆకస్మిక దాడి.. ఐదుగురు అరెస్ట్!

రూ.5 వేల నగదు, 5 సెల్‌ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం

హసన్‌పర్తి,మన ప్రజవాణి,నవంబర్16:

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. పెంబర్తి గ్రామంలోని చకలివాడలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి అరెస్ట్ చేశారు. ఈ దాడిలో రూ.5 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం (16-11-2026) సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో పెంబర్తి గ్రామం చకలివాడలోని చంద్రగిరి శేఖర్ ఇంటి ముందు బహిరంగ ప్రదేశంలో కొందరు వ్యక్తులు డబ్బులు పణంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు హసన్‌పర్తి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

వెంటనే స్పందించిన హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పోలీసులను గమనించిన పేకాటరాయుళ్లు పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిని చంద్రగిరి శేఖర్ (58), తీగల సమ్మయ్య (59), వల్లాల ఐలయ్య (57), నరిహరి లక్ష్మారెడ్డి (46), వేముల రమేష్ (49)గా గుర్తించారు. వీరిలో కొందరు పెంబర్తి గ్రామానికి చెందినవారు కాగా, మరికొందరు హసన్‌పర్తి, హనుమకొండ ప్రాంతాలకు చెందినవారు.

నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ.5,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.