prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 9:20 pm Digital Edition : PRAJA VANI

పెన్ను – పన్ను – పింఛన్.. జర్నలిస్టుల ఐక్య పోరాటం

పెన్ను – పన్ను – పింఛన్.. జర్నలిస్టుల ఐక్య పోరాటం

ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు వినతిపత్రం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులకు ఆసరా కల్పించాలని కోరుతూ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు లు, వార్తాపత్రికలు, మీడియా సంస్థల ప్రతినిధులు . “జర్నలిస్టుల కోసం జర్నలిస్టులు” నినాదంతో, “పెన్ను – పన్ను – పింఛన్” అంటూ ఐక్యతను చాటుతూ వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు తిప్పారపు ఉపేందర్ మాట్లాడుతూ, తరతరాలుగా సమాజం కోసం కలం సాగిస్తున్న జర్నలిస్టులకు కనీస పింఛన్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో, కలం సాగితేనే కడుపు నిండే పరిస్థితిలో జర్నలిస్టులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

ప్రజా సమస్యలు తీర్చే జర్నలిస్టుల జీవితాలే సమస్యల సుడిగుండంలో ఉన్నాయని, వారి కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అందరికీ ఇస్తున్నట్లు జర్నలిస్టులకు కూడా పింఛన్ ఇస్తే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుందన్నారు.

వార్తాపత్రికలు, మీడియా సంస్థలకు వచ్చే అర్హత గల ప్రకటనల ఆదాయంలో 10 శాతం వాటాను జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించాలని, ప్రభుత్వం తరపున అదనంగా 3 శాతం వాటా అందించాలని వినతి పత్రంలో కోరారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి, పారదర్శక ఆడిటింగ్‌తో నిధిని నిర్వహించాలని, అర్హులైన పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంఘాలకతీతంగా, పత్రికలకతీతంగా ఐక్యమై పింఛన్ కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరూ ఒక్కటై ముందుకు సాగాలని కోరారు.

వినతి పత్రం అందించిన వారిలో కుంభం రమేష్ యాదవ్, బూస రమేష్ యాదవ్, బిక్షపతి సుంకరి, చిట్యాల స్వామి తదితరులు ఉన్నారు.