prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:28 pm Digital Edition : PRAJA VANI

నాణ్యత లేని మందులతో మిర్చి రైతుకు ముప్పు!

నాణ్యత లేని మందులతో మిర్చి రైతుకు ముప్పు!

* ఎల్‌నినో దెబ్బకు ఇప్పటికే విలవిలలాడుతున్న తోటలు

* ‘షణ్ముఖ అగ్రి టెక్’ వంటి కంపెనీ ఉత్పత్తుల వాడకంపై రైతుల ఆందోళన

* క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి

వెంకటాపురం (నూగురు), నవంబరు 16: ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకొని, రైతులు తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు నానా తంటాలు పడుతుంటే, మార్కెట్లోకి వస్తున్న కొన్ని రసాయన మందులు, బయో ఉత్ప్రేరకాల వల్ల పంటలకు పెను ముప్పు వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘షణ్ముఖ అగ్రి టెక్ కంపెనీ’ వంటి సంస్థలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులను పిచికారీ చేయడం పట్ల స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, వాటి నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి రైతుల ఆవేదన..
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా మిర్చి తోటలు ఇప్పటికే పట్టుతప్పి విలవిలలాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎలాంటి మందులు వాడాలనే దానిపై స్పష్టత లేకపోవడం, నిపుణులు వద్దని చెబుతున్న కొన్ని రసాయనాలను అజాగ్రత్తగా పిచికారీ చేయడం వల్ల మొక్కలు పూర్తిగా మాడిపోతున్నాయని, పూత, కాయలు రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటను రక్షించుకోవాల్సిన దశలో ఈ మందుల వల్ల ఆశించిన ఫలితం రాకపోగా మరింత నష్టం జరుగుతోందని, తోటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ శూన్యం..
మార్కెట్లో విక్రయిస్తున్న వివిధ బయోటెక్ ఉత్పత్తులు, పురుగుమందులు మరియు ఎరువుల నాణ్యతపై వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించడం లేదని రైతులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఏ మందులు వాడాలో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు (ఏఓ) పట్టించుకోకపోవడం వల్లే ప్రైవేట్ డీలర్ల ఇష్టారాజ్యం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, మార్కెట్లో విక్రయిస్తున్న ‘షణ్ముఖ అగ్రి టెక్ కంపెనీ’ సహా ఇతర అనుమానాస్పద ఉత్పత్తుల నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలు జరపాలని, నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ఏజెన్సీ రైతాంగం డిమాండ్ చేస్తోంది.