prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:40 am Digital Edition : PRAJA VANI

జనగాంలో ఏటీసీకి అనుకూలమైన వేరే స్థలం ఇవ్వాలి

జనగాంలో ఏటీసీకి అనుకూలమైన వేరే స్థలం ఇవ్వాలి

-టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి

జనగాం జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , నవంబర్ 16 (ప్రజావాణి): జనగాంలో మంజూరైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కు అనుకూలమైన వేరే స్థలం కేటాయించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లును నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంపక్ హిల్స్ లోని సర్వే నెంబర్ 140/1 లో ఐటీఐ కాలేజీ కోసం కేటాయించిన 5 ఎకరాల్లో 2 ఎకరాల్లో ఏటీసీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే పక్కనే ఉన్న 220 కెవి సబ్ స్టేషన్ నుండి హై టెన్షన్ వైర్లు ఆ స్థలం మీదుగా పోతుండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, అందుకే వేరే స్థలం కేటాయించాలని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు.

ఏటీసీ మంజూరై ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని, ఇతర నియోజకవర్గాల్లో పనులు మొదలైనా జనగాంలో మాత్రం జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని టీజీఐఐసీకి అప్పగించారని, త్వరగా వేరే స్థలం ఇస్తే పనులు వెంటనే ప్రారంభమవుతాయని అన్నారు. ఏటీసీ వస్తే నిరుపేద విద్యార్థులతో పాటు యువతీ యువకులకు శిక్షణ, స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనుకూలమైన స్థలం కేటాయించి ఏటీసీ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.