prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 5:56 pm Digital Edition : PRAJA VANI

చిన్నారి ప్రాణం కాపాడేందుకు కదిలిన మానవత్వం!

చిన్నారి ప్రాణం కాపాడేందుకు కదిలిన మానవత్వం!
* బేబీ జనని వైద్యానికి 2001 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల విరాళాల సేకరణ
* రెయిన్బో ఆసుపత్రిలో రూ. 25 లక్షల ఖర్చుతో కూడిన అత్యవసర చికిత్స
* కుల్కచర్ల మండల వ్యాప్తంగా తరలివచ్చిన యువత, గ్రామస్తులు.

పరిగి/కుల్కచర్ల నవంబర్ 16,( ప్రజావాణి):

మండల పరిధిలోని రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆటో డ్రైవర్ ఈడిగి నర్సింలు కుమార్తె బేబీ జనని ప్రాణాలను కాపాడేందుకు స్థానిక యువత, పూర్వ విద్యార్థులు మానవత్వంతో ముందుకు కదిలారు. తీవ్రమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ (మెదడు సంబంధిత వ్యాధి) బారిన పడిన చిన్నారి జనని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
చిన్నారి ప్రాణాలు నిలబెట్టాలంటే అత్యవసర చికిత్స నిమిత్తం రూ. 25 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సాధారణ ఆటో డ్రైవర్ అయిన నర్సింలుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చడం తలకు మించిన భారంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న SSC 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు చలించిపోయి, చిన్నారి వైద్యానికి అండగా నిలవాలని సంకల్పించారు.
ఇందులో భాగంగా 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘ఫండ్ రైజింగ్’ (నిధుల సేకరణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు కుల్కచర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.
చిన్నారి జనని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, దాతలు మరిన్ని విరాళాలు అందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.