prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:05 pm Digital Edition : PRAJA VANI

గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం

*గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం!*

*ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో భారీగా నిధుల సాధన.. రూ.60 లక్షలకు పైగా అభివృద్ధి పనులు.. సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటు.. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందడుగు*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 16:-
ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కుంటాల మండలం పెంచికల్పాడ్ గ్రామ సర్పంచ్ కదం హేమంతరావు. 2025 గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆయన.. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో గ్రామానికి భారీగా నిధులు మంజూరు చేయిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.12 లక్షలు, మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.60 వేలు, మహిళా సంఘాల కోసం వీవో భవనం, వీవో షెడ్ నిర్మాణానికి రూ.20 లక్షలు, రైతుల సౌకర్యార్థం గోదాం నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రైతులు, మహిళలు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ కదం హేమంతరావు తన సొంత నిధుల నుంచి రూ.50 వేల ఖర్చుతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం విశేషం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్ల కోసం అర్హులైన 12 మంది నుంచి దరఖాస్తులు సేకరించి, అందులో ఆరుగురికి పింఛన్లు మంజూరు చేయించడంలో చొరవ చూపారు.
పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారు. అలాగే గ్రామంలో సొంత ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో 11 ఇళ్లు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల గ్రామంలో వి.బి.జి. రామ్ జీ పథకం కింద ఇంకుడు గుంతలు, మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలంటే పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బిల్లులు త్వరితగతిన చెల్లిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేయించి పెంచికల్పాడ్ గ్రామ రూపురేఖలను మార్చడమే తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్ కదం హేమంతరావు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.