prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 9:48 am Digital Edition : PRAJA VANI

విద్యార్థులే ఉపాధ్యాయులై.. తరగతి గదుల్లో కొత్త పాఠాలు

*విద్యార్థులే ఉపాధ్యాయులై.. తరగతి గదుల్లో కొత్త పాఠాలు!*

గురువులుగా మారిన పదో తరగతి విద్యార్థులు.. తోటి చిన్నారులకు విద్యాబోధన

ఆటపాటలు, నృత్యాలు, సంప్రదాయ వేషధారణలతో చిన్నారుల సందడి

నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం: కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్

కేసముద్రం, నవంబర్ 14, ప్రజావాణి.

రోజూ పుస్తకాల సంచులతో తరగతి గదుల్లోకి వచ్చే విద్యార్థులే.. ఒక్కరోజు గురువులుగా మారారు. చేతిలో పుస్తకం పట్టుకొని పాఠాలు వినే వారే.. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుల బాధ్యతను స్వయంగా అనుభవించారు. చదువుతోపాటు నాయకత్వం, బాధ్యత, ఆత్మవిశ్వాసం నేర్పించే ఈ వినూత్న కార్యక్రమం శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు రంగురంగుల ఫ్యాన్సీ దుస్తులు, సంప్రదాయ వస్త్రధారణలో హాజరై సందడి చేశారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తాయి.
*ఉపాధ్యాయులుగా మారిన పదో తరగతి విద్యార్థులు!*
వేడుకల్లో భాగంగా నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతి గదుల్లోకి ప్రవేశించి, తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. సాధారణంగా ఉపాధ్యాయుల నుంచి పాఠాలు వినే విద్యార్థులు.. ఆ రోజు గురువుల స్థానంలో నిలబడి బోధన బాధ్యతలను చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది.పాఠాలు చెప్పడంలో ఎదురయ్యే సవాళ్లు, విద్యార్థులను అర్థం చేసుకునే విధానం, తరగతి గదిని నిర్వహించడంలో ఉపాధ్యాయులు చూపే శ్రమను ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పుస్తక జ్ఞానంతోపాటు ఆచరణాత్మక అనుభవం అందించే ఈ కార్యక్రమం వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడింది.

*ప్రతి చిన్నారిలో ఓ ప్రత్యేక ప్రతిభ..!*

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు అని, వారి నవ్వుల్లోనే రేపటి సమాజ అభివృద్ధి దాగి ఉందని అన్నారు.భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, చిన్నారులే భావి భారత నిర్మాణానికి పునాదులని ఆయన విశ్వసించేవారని గుర్తుచేశారు.ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.మొబైల్ ఫోన్ల వినియోగానికి బానిసలు కాకుండా పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మంచి విలువలు అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు స్వయం పరిపాలన వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఆటపాటలు, నృత్యాలు, వేషధారణలు, స్వయం పరిపాలన కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బాలల దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిర్ర నరేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.