prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 8:36 pm Digital Edition : PRAJA VANI

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

# వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం

ప్రజావాణి నవంబర్ 15 కమలాపూర్ మండల్

యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి వేణు సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గి సాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకొని అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలనుకునే రైతులు తాము ఎంపిక చేసుకున్న పంట, విత్తన రకం, సాగుకు అవసరమైన డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పరికరాల వివరాలను సంబంధిత క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓలు) వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు ముందస్తుగా సాగు వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సాంకేతిక సహకారం పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

ఇదిలా ఉండగా, ఒకే శివారులో కనీసం 25 ఎకరాల భూమి కలిగిన రైతులందరూ ఒక సమూహంగా ఏర్పడితే వారికి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సదుపాయం ద్వారా కోతులు, అడవి పందుల నుంచి పంటలకు రక్షణ కల్పించుకోవచ్చని పేర్కొన్నారు.

కావున రైతులందరూ రాబోయే రబీ సీజన్‌లో చేపట్టనున్న పంటల సాగు వివరాలను సంబంధిత క్లస్టర్‌ ఏఈఓల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకొని, ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వేణు కోరారు.