ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు
అన్యాయాన్ని సహించకుండా, స్వతంత్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
భగవాన్ బిర్సా ముండా జీవితం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం..
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి):
భగవాన్ బిర్సా ముండా జీవితం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం 2021 సంవత్సరం నుంచి భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిందని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను గుర్తుచేసుకునే విధంగా ఈ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు.
భగవాన్ బిర్సా ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా, గిరిజనుల హక్కులు, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు గిరిజనుల సంప్రదాయాలు, జీవన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, తమ సంస్కృతి, ఆచారాలు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బిర్సా ముండా నిరంతరం పోరాడారని గుర్తుచేశారు.
తెలంగాణలో కొమురం భీమ్ వంటి గిరిజన పోరాట యోధులు కూడా ఇదే స్ఫూర్తితో తమ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. దేశవ్యాప్తంగా గిరిజన సమాజానికి భగవాన్ బిర్సా ముండా చేసిన సేవలు, ఆయన పోరాట పటిమ గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు.
భగవాన్ బిర్సా ముండా జీవితం నుంచి ప్రతి ఒక్కరూ ప్రధానంగా రెండు విషయాలను నేర్చుకోవాలని సూచించారు. మొదటిది.. ఎవరైనా అన్యాయానికి గురైనప్పుడు దానిని మౌనంగా సహించకుండా, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడాలని అన్నారు. రెండవది.. వ్యక్తులు తమ స్వంత సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని, వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని స్పష్టం చేశారు.
గిరిజనుల భూముల పరిరక్షణకు 1970 నాటి చట్టం, ఎల్‌టీఆర్ (ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్) అమల్లో ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల బదలాయింపునకు సంబంధించి చట్టంలో నిర్దేశించిన నిబంధనలు ఉన్నాయని, గిరిజనుల భూముల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
భగవాన్ బిర్సా ముండా ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని, అన్యాయాన్ని ఎదిరించడం, తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం అనే రెండు ప్రధాన అంశాలను జీవన విధానంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, బంజారా కమ్యూనిటీ ఛైర్మన్ డా. లక్ష్మీనారాయణ నాయక్, కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొని, భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు.
అనంతరం పలువురు వక్తలు, జిల్లా అధికారులు మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. గిరిజన సమాజం ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. భగవాన్ బిర్సా ముండా ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి హసీనా బేగం, ఎల్జెచ్పీస్ రాష్ట్రా కార్యదర్శి అనిత వంకుడోత్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి నాయక్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర స్వరూప రాజేందర్, సర్పంచ్ దారావత్ రాజు, కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, సభ్యులు, జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బంది, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
