prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 1:46 pm Digital Edition : PRAJA VANI

_జనగామ మినీ స్టేడియంలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్ తక్రా టోర్నమెంట్

_జనగామ మినీ స్టేడియంలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్ తక్రా టోర్నమెంట్_

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):జనగామ మినీ స్టేడియంలో 70వ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ ముగింపు వేడుకల్లో జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి – శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన బాలబాలికల క్రీడాకారులకు ఛైర్పర్సన్ జ్ఞాపికలు, బహుమతులు అందజేసి హృదయపూర్వకంగా అభినందించారు. రన్నరప్‌గా నిలిచిన జట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఓటమితో నిరాశ చెందకుండా మరింత కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడాకారులకు సూచించారు.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జిల్లాల బాలబాలికలకు, విజేతలకు, కోచ్‌లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జనగామ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జనగామలో ఇలాంటి క్రీడా పోటీలు మరిన్ని నిర్వహించేందుకు మున్సిపాలిటీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు, స్కూల్స్ ఫెడరేషన్ సభ్యులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.