prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 2:51 pm Digital Edition : PRAJA VANI

నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి

నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి . కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 14 (ప్రజావాణి):

దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ నిర్మాత, భారత రత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు.
జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న బాలల దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎస్సీ బాలికల వసతి గృహంలో చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొని పెన్నులు, నోట్ బుక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో నెహ్రూ చూపిన దూరదృష్టి అనిర్వచనీయమని అన్నారు.
విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అన్ని రంగాల అభివృద్ధికి ఆయన వేసిన బలమైన పునాదులే నేటి భారత ప్రగతికి బాటలు వేశాయని పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, అణు పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, డ్యాముల నిర్మాణం వంటివన్నీ నెహ్రూ గారి దూరదృష్టికి నిదర్శనమని అన్నారు.
నెహ్రూ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, కుల మతాలకు అతీతంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి యువత నెహ్రూ గారి జీవితాన్ని, ఆయన రచనలను చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు.
ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు గట్టిగా విశ్వసించేవారని గుర్తుచేశారు. పిల్లలంటే ఆయనకు ఎనలేని ప్రేమని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, భయం లేని బాల్యాన్ని అందించి, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని అన్నారు. పిల్లలకు కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా విలువలతో కూడిన విద్యను, మానవతా విలువలను, దేశభక్తిని అందించినప్పుడే నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారిని సరైన మార్గంలో నడిపించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దితేనే బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్ తోపాటు ఎస్సీ హాస్టల్ వార్డెన్ వీణ తదితరులు సిబ్బంది లు విద్యార్థులు పాల్గొన్నారు.