నెల్లుట్ల అంగన్వాడీ సెంటర్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు – సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘణపురం మండలం,
నెల్లుట్ల గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా, సందడిగా జరిగాయి.
భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత, పిల్లల ప్రియమైన చాచా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు, చాక్లెట్లు పంచి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. చిన్నారుల చిరునవ్వులతో అంగన్వాడీ సెంటర్లు కళకళలాడాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ.. పిల్లలంటే నెహ్రూ కి ఎనలేని ప్రేమ అని, ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని ఆయన నమ్మేవారని గుర్తు చేశారు. అందుకే ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
బాలల పరిశుభ్రత, ఆరోగ్యం, పోషణ విషయంలో తల్లిదండ్రులతో పాటు అంగన్వాడీ టీచర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలు రోజూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, గోళ్లు కత్తిరించుకునేలా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు నాణ్యమైనదిగా, వేడివేడిగా, సమయానికి అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. పౌష్టికాహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, పిల్లల ఆరోగ్య విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారం, మంచి వాతావరణం ఉంటేనే ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు పిల్లల హాజరు శాతం మెరుగుపడుతుందని అన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామ సర్పంచ్‌గా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. గ్రామంలో ఏ బాలుడు కూడా బాల కార్మికుడిగా ఉండకూడదని, ప్రతి బాలుడు తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే విధంగా తన వంతుగా చర్యలు తీసుకుంటానని అన్నారు. పిల్లలను పనికి పంపకుండా బడికి పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీ సెంటర్లకు, పాఠశాలలకు సంబంధించిన మౌలిక వసతులు – భవనాలు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆట స్థలం వంటివి ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఎమ్మెల్యే తో, సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధికి తన వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారికి మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి సంస్కారం, విలువలతో కూడిన పెంపకం అందించడమే మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. నెల్లుట్ల గ్రామాన్ని బాలల సంక్షేమంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.