prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

గండి యాదయ్య మృతదేహానికి ఘన నివాళులు

గండి యాదయ్య మృతదేహానికి ఘన నివాళులు

బీఆర్ఎస్, తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ నాయకుల సంతాపం – కుటుంబానికి అండగా ఉంటామని హామీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన గండి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి వార్తతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆయన మృతదేహానికి బీఆర్ఎస్ పార్టీ, తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పూలమాలలు వేసి, పూలు చల్లి, మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి :

గండి యాదయ్య గ్రామంలో అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని నాయకులు గుర్తుచేసుకున్నారు. తాపీ మేస్త్రి వృత్తిలో ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించారని, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో, కార్మిక సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. ఆయన మృతి కుటుంబానికి, గ్రామానికి, తాపీ మేస్త్రి సంఘానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

*కుటుంబ సభ్యులకు పరామర్శ :*
మృతుడికి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహం వద్దకు చేరుకున్న నాయకులు వృద్ధ తల్లిదండ్రులను, భార్య, కుమారులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ సంతాప కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు, ఉపసర్పంచ్ నక్క రేణుక కొమురయ్య, పాక్స్ నక్క రమేష్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, సీనియర్ నాయకులు జేరిపోతుల సాయిలు, మండల అధికార ప్రతినిధి సుడిగేల హన్మంతు, నగేష్, కత్తుల సుధాకర్, సూలుగురి మహేష్, ఉడుత రాజకుమార్, సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.