prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:24 am Digital Edition : PRAJA VANI

అల్సర్ నొప్పి భరించలేక గడ్డిమందు తాగిన యువకుడు మృతి

అల్సర్ నొప్పి భరించలేక గడ్డిమందు తాగిన యువకుడు మృతి

జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది తీవ్రమైన అల్సర్ నొప్పిని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీకి చెందిన పుల్లూరి రాధమ్మ, కొమురయ్య దంపతుల రెండవ కుమారుడు పుల్లూరి శ్యాంమూర్తి (34) గత కొంతకాలంగా అల్సర్ సంబంధిత నొప్పితో తీవ్రంగా బాధపడుతూ మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు యధావిధిగా పనికి వెళ్లిన శ్యాంమూర్తి, సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ఇంటి బయట కూర్చుని తన తల్లి రాధమ్మను పిలిచి, తాను గడ్డిమందు తాగినట్లు చెప్పి ఖాళీ డబ్బాను చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన తల్లి రాధమ్మ, పెద్ద కుమారుడు నరేష్ , శ్యాంమూర్తి భార్య కలిసి అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, ఆ తర్వాత హనుమకొండ బాలసముద్రంలోని ఓజస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్యాంమూర్తి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. తన కుమారుడు అల్సర్ నొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి రాధమ్మ జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేసిందిఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు