prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 4:40 pm Digital Edition : PRAJA VANI

అర్హులందరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

సుల్తానాబాద్ మండలంలో 755, పట్టణంలో 286 నూతన పింఛన్లు మంజూరు

నవంబర్ 19న లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నగదు జమ:

ప్రభుత్వ విప్ విజయరమణ రావు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 14

సుల్తానాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 286 మందికి, మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో 755 మందికి కలిపి మొత్తం 1,041 నూతన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ అవుతుందని వెల్లడించారు.

సాంకేతిక కారణాలతో పింఛన్లు రాని అర్హులు ఆందోళన చెందవద్దని, రీ-సర్వే ద్వారా అర్హులను గుర్తించి పింఛన్లు అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. త్వరలో వృద్ధులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని, రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేస్తోందని తెలిపారు.

అనంతరం లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, డీఆర్‌డీఏ ఏపీఢీ రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.