prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:31 am Digital Edition : PRAJA VANI

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

వరుసగా రెండో రోజూ కూల్చివేతలు!

ఐలాపూర్ తండా,విలేజ్‌లో జేసీబీలతో బేస్‌మెంట్ల తొలగింపు

సర్వే నంబర్ 1112లో ప్రభుత్వ భూమి స్వాధీనం

అమీన్‌పూర్, నవంబర్ 13 (ప్రజావాణి): ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అమీన్‌పూర్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆక్రమణల తొలగింపు చర్యలను వరుసగా రెండో రోజూ కొనసాగించారు. నర్రెగూడెం ,ఐలాపూర్ తండా, ఐలాపూర్ విలేజ్ పరిధిలో అక్రమంగా నిర్మించిన బేస్‌మెంట్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు. అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని నర్రెగూడెం సర్వే నంబర్ 1112లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు.
అమీన్‌పూర్ ఎమ్మార్వో వెంకటేశం ఆదేశాల మేరకు ఆర్‌ఐ సంగీత, మల్లికార్జున్‌, సిఎంసి అధికారుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.ఇప్పటికే గురువారం సర్వే నంబర్లు 991, 630, 1042లో అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు.. శుక్రవారం మరో ప్రాంతంలోనూ చర్యలు కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం ముందుకు సాగుతోంది.ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరుసగా చేపడుతున్న కూల్చివేతలతో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూములకు హద్దులు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా శాశ్వత రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.