prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 11:53 am Digital Edition : PRAJA VANI

బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం లోని బేటి చెరువు పక్కనే తవ్వకాలు నిర్వహిస్తున్న గ్రాన్ మార్ట్ ఎక్స్ పోర్ట్, శ్రీనివాస గ్రానైట్ క్వారీలు బేటి చెరువును ఆక్రమిస్తున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ప్రజావాణిలో సైతం ఈ మేరకు కంప్లైంట్ చేశామని తెలిపారు.గ్రానైట్ క్వారీ లలో తవ్వకాలు జరుపుతూ వేస్ట్ రౌతులతో పాటు, మట్టి ఇతర వ్యర్ధాలను చెరువు భూమిలో కుప్పలు తెప్పలుగా డంపింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్వేనెం. 183 నుంచి 191 లలో గల 234. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు భూమి ఆక్రమణకు గురవుతోందని సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న సంబంధిత క్వారీలు రాత్రనక పగలనక బ్లాస్టింగ్ లకు పాల్పడడంతో విపరీతమైన శబ్దాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ధ్వని, వాయు కాలుష్యం తో ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతోందని సర్పంచి తెలిపారు.

కెమికల్స్ తో చేపలు మృత్యువాత..

గ్రానైట్ క్వారీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు బ్లాస్టింగ్ తదితర పనులకు ఉపయోగించే కెమికల్స్ చెరువులో డంపు చేయడం వలన రెండు మాసాల క్రితం చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయని సర్పంచి తెలిపారు.దీంతో చేపల పెంపకం దారులు నష్టపోయారన్నారు.గ్రామంలో పూర్వం నుంచి ప్రజలకు జీవనాధారమైన చెరువులను ఆక్రమిస్తూ, వ్యర్ధాలను కెమికల్స్ ను డంపు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఆక్రమణ స్థలం నుంచి వ్యర్థాలను తొలగించాలన్నారు.ధ్వని,వాయు కాలుష్యాలకు పాల్పడకుండా గ్రానైట్స్ వారిపై చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యం కాపాడాలని సర్పంచి సంబంధిత అధికారులను కోరారు.