పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం
*మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, వారు పండించిన పత్తికి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన పత్తికి సరైన ధర అందాలని, అందుకోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని, సరైన తూకంతో పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని, కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజ మల్లేశం, చేర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ల భాస్కర్ రెడ్డితో పాటు చేర్యాల, కొమురవెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.