prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 4:34 pm Digital Edition : PRAJA VANI

జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం నవంబర్-15న రిలే నిరసన దీక్షలు

జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం నవంబర్-15న రిలే నిరసన దీక్షలు

జవహర్ నగర్ నవంబర్ 13 (ప్రజావాణి ప్రతినిధి )
— మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తనయుడు మహేందర్ రెడ్డి గార్లకు వినతిపత్రాలు
— ఎం.పి. ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ పార్టీ డిసిసి వజ్రేష్ అధ్యక్షులు యాదవ్ గార్ల మద్దతు కొరకు త్వరలో వినతిపత్రాలు అందజేయనున్నామని వెల్లడి
— జేఏసి కమిటీలో కో-కన్వీనర్ గా బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి
— జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి

జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ (జేఏసి) ఆధ్వర్యంలో నవంబర్-15 నుంచి చేపట్టనున్న రిలే నిరసన దీక్షలకు మద్దతుగా నిలబడాలని కోరుతూ, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తనయుడు మహేందర్ రెడ్డి గార్లకు శుక్రవారం రోజు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని జేఏసి చైర్మన్ షేక్ షావలి తెలియజేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల జవహర్ నగర్, దమ్మాయిగూడ, కాప్రా, కీసర, శామీర్ పేట, ఘట్ కేసర్, యాప్రాల్, చెంగిచర్ల తదితర మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఒక ప్రజాప్రతినిధిగా మల్లారెడ్డి గారికి తెలుసని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు, ఇచ్చిన హామీల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. డంపింగ్ యార్డు నుంచి వస్తున్న భరించలేని దుర్వాసన వల్ల రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని గుర్తుచేశారు. భూగర్భ జలాలు కలుషితం కావడం, తాగునీరు పనికిరాకుండా పోవడంతో ప్రజలు ఆరోగ్యపరంగా పలు శారీరక, మానసిక బాధలకు గురవుతున్నారని పేర్కొన్నారు. దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా, చర్మ వ్యాధులు ప్రబలడంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు శ్వాస సంబంధిత వ్యాధులకు గురై తీవ్ర మనోవేదనతో తల్లడిల్లుతున్నారని అన్నారు. చెరువులు, కుంటలు విషంగా మారి, రైతుల పంటలు, పాడి పశువులు నష్టపోవడం, మత్స్యకారులు ఇబ్బంది పడడం జరుగుతున్నదని తెలియజేశారు. ఏళ్ల తరబడి ప్రజలు విన్నవించుకున్నా, డంపింగ్ యార్డును ఎత్తివేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఎవరికి వారు తమదైన రాజకీయ కార్యక్రమాలతో సాగదీత ధోరణి అవలంబిస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత పెరిగిందని అన్నారు. అందుకే సహనం కోల్పోయిన ప్రజలు, జేఏసి ఆధ్వర్యంలో నవంబర్-15 నుంచి రిలే నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందుకే ముందుగా మేడ్చల్ ఎమ్మెల్యే గారిని కలిసి, ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని, శాసనసభలో ఈ సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరితో కలిసి లేవనెత్తి, డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం కంటే డంపింగ్ యార్డు ముఖ్యం కాదని, పార్టీలు, పదవులను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎం.పి. ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గార్లకు కూడా సమస్య పరిష్కారానికి త్వరలో మెమోరాండంలు సమర్పించి, రిలే దీక్షలకు మద్దతు కోరనున్నామని వెల్లడించారు. దమ్మాయిగూడ జేఏసితో పాటు నాలుగు మండలాల బాధిత ప్రాంతాల ప్రజలు రిలే నిరసన దీక్షలలో భాగస్వామ్యం వహించి, యార్డును సంపూర్ణంగా తొలగించేంత వరకు జరిగే పోరాటానికి తమ సంపూర్ణమైన నైతిక మద్దతును అందించాలని కోరారు. పదవి ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే రాజీనామా చేసి, జేఏసికి అండగా నిలబడి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసిన మల్లారెడ్డి గారికి మరియు
జేఏసి విన్నపాన్ని అంగీకరించి, డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీలో కో-కన్వీనర్ గా కొనసాగడానికి అంగీకరించిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసి కోశాధికారి, ఐ.ఎఫ్.టి.యు. శివబాబు, కో-కన్వీనర్లు బీఆర్ఎస్ ఆలూరి రాజశేఖర్, ఎక్స్ కార్పొరేటర్ పల్లపు రవి, టి.యు.సి.ఐ. వి. ప్రవీణ్, పి.కె.ఎం. డి. జాన్, ఏ.ఐ.ఎఫ్.టి.యు. వై. మల్లేష్, సి.ఎం.ఎస్. జయ తదితరులు పాల్గొన్నారు.