prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 7:52 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ వల్లనే పేదలకు పెన్షన్లు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాంగ్రెస్ వల్లనే పేదలకు పెన్షన్లు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నెల్లుట్లలో సంక్షేమ పండుగ – నూతన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): పేదల కష్టాలను అర్థం చేసుకున్న ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 4 లక్షల 50 వేల చేయూత పెన్షన్లను మంజూరు చేసిందని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

శుక్రవారం జిల్లా లోని లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ అర్హత పత్రాల, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరెన్ని రాజకీయ విమర్శలు చేసినా, పేద ప్రజల సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు.. ఇలా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అది పేదల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ.. నెల్లుట్ల గ్రామంలో 136 మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన 5 రకాల పెన్షన్ల డబ్బును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు చెప్పారు. మండలంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.

నెల్లుట్ల గ్రామానికి చేకూరిన లబ్ధి :

-CMRF చెక్కుల ద్వారా – రూ. 3,24,000

-కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా రూ. 12,01,392

-136 మంది పెన్షన్ ద్వారా ప్రతి నెలా రూ. 3,42,000

పెన్షన్ల వివరాలు :

-వికలాంగులు 35 మంది
-వితంతువులు 66 మంది
-గీత కార్మికులు 27 మంది
-చేనేత కార్మికులు 01
-ఒంటరి మహిళలు 07 మంది
-మొత్తం 136 మంది

చెక్కులు, పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి, సర్పంచ్ పాలక మండలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.