prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 8:52 pm Digital Edition : PRAJA VANI

సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ కు ఎంజీయూ ముస్తాబు

*సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ కు ఎంజీయూ ముస్తాబు*

*మూడు రోజుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తి – వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయంలో నిర్వహించనున్న 45 వ సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ తెలిపారు. చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా చరిత్రకారులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనలకు ప్రోత్సాహంతోపాటు విశ్వవిద్యాలయ నిర్వహణ సామర్థ్యాన్ని చాటేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి హాజరుకానున్నారని సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆచార్య విక్టర్‌బాబు తెలిపారు. బెంగళూరు విశ్వ విద్యాలయానికి చెందిన ఆచార్య షేక్‌ మస్తాన్‌ ప్రధాన ఉపన్యాసం చేయనున్నట్లు వెల్లడించారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక చరిత్ర తదితర అంశాలపై ఎనిమిది ప్యానెళ్లలో పరిశోధన పత్రాల సమర్పణ, చర్చలు జరుగుతాయన్నారు.
దక్షిణ భారత చరిత్రలో కొత్త పరిశోధనలను చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని స్థానిక కార్యదర్శి డాక్టర్‌ పనస రామకృష్ణ, ఆచార్య విజయబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ, నల్లగొండ ప్రాంతాల చరిత్ర అధ్యయనానికి దోహదపడుతుందని తెలిపారు. సదస్సు ఏర్పాట్లను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.