prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 6:08 pm Digital Edition : PRAJA VANI

సరస్వతీ దేవిని దర్శించుకున్న వానరం.. విద్యార్థులను ఆకట్టుకున్న అపురూప దృశ్యం

సరస్వతీ దేవిని దర్శించుకున్న వానరం.. విద్యార్థులను ఆకట్టుకున్న అపురూప దృశ్యం!

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లిలో ఆసక్తికర ఘటన

ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:

పాఠశాల ఆవరణలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర దృశ్యం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లి ప్రాంగణంలో కొలువుదీరిన చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహం ఎదుట ఓ వానరం వచ్చి కూర్చుంది. అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ చేతులు జోడించినట్లుగా ప్రశాంతంగా కూర్చున్న ఆ వానరాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

సాధారణంగా కోతులు ఒకచోట నిలకడగా ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుంటాయి. అలాంటిది సరస్వతీ దేవి విగ్రహం పక్కనే ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

విద్యార్థులకు ఓ చక్కని సందేశం..

విద్యార్థులారా! ఈ దృశ్యం మనకు ఒక మంచి విషయాన్ని గుర్తుచేస్తోంది. సరస్వతీ దేవి జ్ఞానానికి, విద్యకు ప్రతీక. మనం కూడా చదువుపై శ్రద్ధ, గురువులపై గౌరవం, పుస్తకాలపై ప్రేమ కలిగి ఉండాలి. పాఠశాలకు వచ్చిన ప్రతి రోజును జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశంగా భావించాలి.

మంచి విద్య, మంచి నడవడిక, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం మన జీవితానికి నిజమైన అలంకారాలు. చదువుతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి.

ఒక చిన్న వానరం సందర్శన.. విద్యార్థులకు మాత్రం ఎన్నో మంచి విలువలను గుర్తుచేసిన అపురూప దృశ్యం!