prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 6:32 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రంలో గృహప్రవేశాల సందడి.. అనంతగిరిలో పేదల ఎదురుచూపులే

ప్రజావాణి అనంతగిరి

రాష్ట్రంలో గృహప్రవేశాల సందడి.. అనంతగిరిలో పేదల ఎదురుచూపులే!

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కానరాని స్పష్టత.. అర్హుల ఎదురుచూపులకు ఎప్పుడు తెర?

అధికారుల నిర్లక్ష్యమా.. ప్రజాప్రతినిధుల అలసత్వమా?

అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అనంతగిరి మండలంలోని నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాల సందడి కనిపిస్తుంటే.. అనంతగిరి మండలంలో మాత్రం అర్హులైన పేదల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఇళ్ల మంజూరుపై ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంతో తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందోనని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో సొంత ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో, చిన్నచిన్న గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించడంతో తమకూ సొంతింటి భాగ్యం కలుగుతుందని ఆశించాయి. అయితే మంజూరులో జాప్యం, పథకం అమలుపై స్పష్టత లేకపోవడంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంజూరులో జాప్యం.. పేదల్లో ఆందోళన!

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగుతుంటే అనంతగిరి మండలంలో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. మండలానికి ఎన్ని ఇళ్లు కేటాయించారు? ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందిని అర్హులుగా గుర్తించారు? ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు? ఇంకా ఎంతమంది ఎదురుచూస్తున్నారు? అనే వివరాలపై ప్రజలకు స్పష్టత కరువైంది. అర్హుల ఎంపిక, మంజూరుల పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజాప్రతినిధుల చొరవ ఏదీ?

నిరుపేదల సొంతింటి సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. పేదల ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ఎంతవరకు చొరవ చూపుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

లెక్కలు చెప్పాలి.. పేదలకు ఇళ్లు ఇవ్వాలి!

జిల్లా ఉన్నతాధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులు అనంతగిరి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలి. వచ్చిన దరఖాస్తులు, అర్హుల ఎంపిక, మంజూరైన ఇళ్ల సంఖ్య, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించాలి. మంజూరులో జాప్యానికి గల కారణాలను స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆరు నెలలుగా పునాది వద్దే ఎదురుచూపులు!

తెల్లబండ తండాకు చెందిన గుగులోత్ నరేష్ తనకు ఎదురైన పరిస్థితిని వివరిస్తూ. పలుమార్లు ఉన్నత అధికారులను కలిసి విజ్ఞప్తి చేశానని ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదని కాలం గడుస్తూనే ఉంది కానీ తనకు న్యాయం జరగటం లేదని రాష్ట్ర మొత్తం ఒక న్యాయం అనంతగిరి మండలానికి మాత్రం ఒకలాగా ఉందని తన బాధను వ్యక్తం చేశారు ఇకనైనా అనంతగిరి మండలానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు