*నవంబర్ 14 న కల్చరల్ ఫెస్ట్ – ఆటపాట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*
*అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభల సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు*
*పాలడుగు నాగార్జున, కల్చరల్ ఫెస్ట్ ఇన్‌చార్జి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్లగొండ పట్టణం లో నవంబర్ 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 14 న నల్లగొండ పెద్ద గడియారం సెంటర్ లో కల్చరల్ ఫెస్ట్ (కళా సాంస్కృతిక ఉత్సవం) నిర్వహిస్తున్నట్లు ఫెస్ట్ ఇన్‌చార్జి పాలడుగు నాగార్జున తెలిపారు. గురువారం నల్లగొండ పెద్ద గడియారం సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధర, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వంటి అనేక అంశాలను ప్రజలకు తెలియజేసే విధంగా వివిధ కళారూపాలతో ఈ కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా కళాకారులు తమ ఆటపాటల ద్వారా రైతాంగ సమస్యలను, ప్రజా ఉద్యమాల చరిత్రను, సామాజిక అంశాలను ప్రజల ముందుకు తీసుకురానున్నారని పేర్కొన్నారు. పాటలు, నృత్యాలు, జానపద కళారూపాలు, నాటికలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలతో పెద్ద ఎత్తున ఈ ఉత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కళలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల సమస్యలను ప్రతిబింబించడానికి, ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినివ్వడానికి ఉపయోగపడతాయని అన్నారు. రైతాంగ పోరాటాలకు కళారూపాలు ఎప్పుడూ అండగా నిలిచాయని తెలిపారు. నవంబర్ 14 న ఉదయం 10 గంటలకు కల్చరల్ ఫెస్ట్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేకంగా ఆటపాటల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణ ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కల్చరల్ ఫెస్ట్ ను విజయవంతం చేయాలని పాలడుగు నాగార్జున విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆవుట రవీందర్, భీమగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.