prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 6:00 pm Digital Edition : PRAJA VANI

అధికారులు అసైన్డ్ భూముల్లో చేపట్టిన సర్వేలు

అధికారులు అసైన్డ్ భూముల్లో చేపట్టిన సర్వేలు

ముమ్మరంగా కొనసాగుతున్న విచారణ

ములుగు ప్రతినిధి (ప్రజావాణి):-

వెంకటాపూర్(రామప్ప) మండలంలో రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది.
368, 341, 441 సర్వే నంబర్ల పరిధిలోని అసైన్డ్ భూముల్లో అక్రమాలపై వార్తలు, ఫిర్యాదులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి.
దీంతో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించి సుమారు 50 ఎకరాల్లో సర్వే చేపట్టారు.
ఏ భూమి ఎవరి పేరు మీద నమోదైంది, మోకా మీద వాస్తవంగా ఎవరున్నారో కొలతలు వేసి తేలుస్తున్నారు.
సాగు ఎవరు చేస్తున్నారు, ఆక్రమణ ఎక్కడ జరిగిందో హద్దులు గుర్తిస్తూ పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో రెవెన్యూ కార్యాలయంలో పాత రికార్డులను పరిశీలిస్తున్నారు.
పట్టా పాస్ బుక్కులు, మ్యుటేషన్ వివరాలు, సర్వే మ్యాపులు, ధరణి రికార్డులను మాన్యువల్ రికార్డులతో సరిపోల్చి చూస్తున్నారు.
ఎవరికి ఎప్పుడు, ఏ నిబంధనల ప్రకారం పట్టా జారీ అయ్యిందో విచారిస్తున్నారు.
ఒకే భూమికి రెండు రకాల రికార్డులు ఉన్నాయా, బినామీ పేర్లతో కొనుగోలు, రిజిస్ట్రేషన్లు జరిగాయా అని తనిఖీ చేస్తున్నారు.
పేదల పేరు మీద ఉన్న పట్టా భూమిలో మరో వ్యక్తి ఎలా చేరాడో, అతనికి పట్టాలు, రైతుబంధు, బ్యాంకు రుణాలు ఎలా అందుతున్నాయో విచారిస్తున్నారు.
స్థానికుల నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు.
సర్వే, రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
ఆ నివేదిక ఆధారంగా అక్రమంగా కొన్నవారిపై, అమ్మినవారిపై, సహకరించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, అవసరమైతే అక్రమ పట్టాలను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారాన్ని మండల స్థాయికే పరిమితం చేయకుండా కలెక్టర్ ప్రత్యేక బృందంతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.