prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 4:44 pm Digital Edition : PRAJA VANI

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీయే అధికారికం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీయే అధికారికం!

మీడియా పాయింట్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తే సహించేది లేదు

హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుకరాజు సదానందం

హసన్‌పర్తి, నవంబర్ 11, (మన ప్రజావాణి):

హసన్‌పర్తి మీడియా పాయింట్ పేరుతో కొందరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుకరాజు సదానందం ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ మాత్రమే అధికారికమని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం హసన్‌పర్తి మండల కేంద్రంలోని మీడియా పాయింట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం మండలానికి చెందిన 25 మంది విలేకరులతో ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఎలుకరాజు సదానందం తన ప్రత్యర్థి దండుగూడం రాజకుమార్‌పై ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన గరిగె శ్రీనివాస్, గడ్డం సంపత్‌పై 19 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు వివరించారు. కోశాధికారిగా దాడి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా గోలె రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షులుగా దాడి భిక్షపతి, పోగుల రాజుకుమార్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారని, మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఎన్నికల ఫలితాలను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ సభ్యుడు, ఎన్నికల అధికారి కందుకూరి సంజీవ్ అధికారికంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

వ్యక్తిగత స్వార్థంతో తప్పుడు ప్రచారాలు..

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు మరో సమూహంగా ఏర్పడి హసన్‌పర్తి మీడియా పాయింట్ పేరుతో పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని అధ్యక్షుడు ఎలుకరాజు సదానందం, ప్రధాన కార్యదర్శి గరిగె శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరిని ప్రలోభాలకు గురిచేస్తూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మీడియా పాయింట్ పేరుతో వెలువడే తప్పుడు ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని, కమిటీల పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. జర్నలిస్టులపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.