prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:02 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులర్పించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, నవంబర్ 10:తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన కలంతో స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ సేవలు చిరస్మరణీయమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు.

ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ సమీపంలోని అందెశ్రీ స్మృతివనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుమారుడు దత్తసాయితో కలిసి వేముల మహేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ రచించిన గీతాలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌సీ మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల కేశవనాదం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.