prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:41 pm Digital Edition : RAJU NANGUNOOR

*ఖాతాదారుల విశ్వాసమే బ్యాంకు అభివృద్ధికి బలం* *నంగునూరు యూనియన్ బ్యాంకులో ఘనంగా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు*

నంగునూరు, నవంబరు 11

దేశ ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశేష కృషి చేస్తోందని బ్యాంక్ మేనేజర్ గౌరవ్ అన్నారు. నంగునూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుధవారం నిర్వహించిన బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.అనంతరం మేనేజర్ మాట్లాడుతూ.. సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారులు, మహిళలు, యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తోందని తెలిపారు. పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తదితర వాటి ద్వారా ఖాతాదారుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.బ్యాంకింగ్ సేవలు కేవలం నగదు లావాదేవీలకే పరిమితం కాకుండా ప్రజల ఆర్థిక స్వావలంబనకు, వ్యాపార అభివృద్ధికి, వ్యవసాయ రంగ ప్రగతికి దోహదపడుతున్నాయని వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకొని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆర్థిక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఖాతాదారులు తమ పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడంతోపాటు బ్యాంకు అందించే వివిధ రుణ, బీమా, డిజిటల్ సేవలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని కోరారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 108 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో యూనియన్ బ్యాంక్ ప్రజలకు అందిస్తున్న సేవలు, ఖాతాదారులతో ఏర్పడిన విశ్వాసపూర్వక సంబంధాలు బ్యాంకు అభివృద్ధికి ప్రధాన బలమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొని వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.