కాంగ్రెస్ నాయకులకు దుబ్బాకలో కరువు కనిపించడం లేదా ?
సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రైతులను ఆదుకోవాలి..
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం
దుబ్బాక నియోజకవర్గంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు కనిపించడం లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవైపు ఎండిపోతున్న పంట పొలాలు, మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఇంకోవైపు రబీ సాగుపై నెలకొన్న అనిశ్చితితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమైందని విమర్శించారు.
బుధవారం తొగుట మండలంలోని వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి, చందాపూర్, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు రబీ పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.
మల్లన్నసాగర్లో గోదావరి జలాలు ఉంటే ఈ కరువు ఎందుకు?
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలను నింపకుండా రైతులకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షలు, విమర్శలను పక్కనపెట్టి మల్లన్నసాగర్‌ను గోదావరి జలాలతో నింపి, ఉపకాలువల నిర్మాణం చేపడితే దుబ్బాక రైతులకు రబీ సాగుపై భరోసా లభించేదన్నారు. గతంలో రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
కరువు మండలాలుగా ప్రకటించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభ్యంతరమేంటి?
గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు దుబ్బాక నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు ఆర్థిక సహాయం, పంట రుణాల రీషెడ్యూల్, పశుసంపద పరిరక్షణతో పాటు సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక రైతులకు సమాధానం చెప్పాలి.ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ రైతుల సమస్యలపై స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, మల్లన్నసాగర్లో గోదావరి జలాలను నింపాలని, ఉపకాలువల నిర్మాణం చేపట్టాలని, గతంలో రద్దు చేసిన నిధులను తిరిగి మంజూరు చేయాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.మృతుల కుటుంబాలకు పరామర్శ.. బాధితులకు భరోసా అనంతరం చందాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గుడ్డోజి కవిత ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్దమాసాన్‌పల్లికి చెందిన సీనియర్ నాయకుడు జయరాంరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుడికందుల గ్రామంలో ఇటీవల మృతి చెందిన సర్వయ్యాగారి ఎల్లారెడ్డి, మట్ట వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.