prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 10:07 am Digital Edition : PRAJA VANI

పదవిలో లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా..

పదవిలో లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా..!
జజ్జులరావుపేటకు స్మశాన రథం, వాటర్ ట్యాంకర్ కానుక
సొంత ఖర్చులతో సమకూర్చిన మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు
ప్రారంభించిన ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి
కూసుమంచి (మన ప్రజావాణి) ప్రతినిధి: పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగితేనే నిజమైన నాయకత్వానికి గుర్తింపు లభిస్తుందని జజ్జులరావుపేట మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు చాటిచెప్పారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి తమ సొంత ఖర్చులతో స్మశాన రథం, వాటర్ ట్యాంకర్‌ను సమకూర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయంగా నిలిచింది.
ఈ సేవా కార్యక్రమాలను ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా, పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు తమ సొంత ఖర్చులతో స్మశాన రథం, వాటర్ ట్యాంకర్‌ను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి సేవా దృక్పథం నేటి ప్రజాప్రతినిధులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చిన మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవులు ప్రజాసేవకు అడ్డంకి కావని, సేవ చేయాలనే తపన ఉంటే ఎప్పుడైనా ప్రజలకు అండగా నిలవవచ్చని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.
ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కంచర్ల జీవన్ రెడ్డి, చాట్ల పరశురాం, శ్యాంసుందర్ రెడ్డి, బాణోత్ రవి, మాజీ ఎంపీటీసీ వాకా సుధారాణి, సర్పంచులు వడిత్య వెంకటేష్ నాయక్, బానోత్ నాగేశ్వరరావు, దాట్ల సతీష్, జజ్జులరావుపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కలకొండ పున్నయ్య, గ్రామ ఉపసర్పంచ్ గంగా భవాని, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.