ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (ప్రజావాణి): ఘట్‌కేసర్ ఎంఎంసీ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 107వ వార్షికోత్సవాన్ని కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సువర్ణ ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కల్లూరి జయచంద్ర మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సీపీఐ కార్యదర్శి ఎల్. ఈశ్వర్, సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ రామచంద్ర, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాల నరసింహ, టి. శ్రీరాములు, భూపాల్, రామ్‌కుమార్, అరుణ, రాజు, శోభ, బాలమణి, రమాదేవితో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.