prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:39 am Digital Edition : PRAJA VANI

కంగ్టి ఎంపీడీవోగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ

కంగ్టి ఎంపీడీవోగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందిస్తా: ఇన్‌చార్జి ఎంపీడీవో లక్ష్మణ్

నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి):

కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) లక్ష్మణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం కంగ్టి మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించిన దయాకర్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఉన్నతాధికారులు లక్ష్మణ్‌ను ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. ఈ మేరకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన ఇన్‌చార్జి ఎంపీడీవో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.మండలంలోని ప్రతి గ్రామ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, వారి సమస్యలను సకాలంలో గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తానన్నారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు, పంచాయతీరాజ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కంగ్టి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లక్ష్మణ్ పేర్కొన్నారు.