prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:03 am Digital Edition : PRAJA VANI

ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల వీరంగం

ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల వీరంగం!

సిద్ధాపురంలో యువకుడిపై రాళ్లు, కర్రలతో దాడి.. తీవ్రంగా గాయపడిన యువకుడు

హసన్‌పర్తి, అక్టోబర్ 31 (మన ప్రజావాణి):

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపురం గ్రామంలో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి చెందిన విదేశీ విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై శనివారం సాయంత్రం బాధితుల ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన గ్రామస్థులపై దాడి

ఫిర్యాదుదారు ముస్కు మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విదేశీ విద్యార్థులు సిద్ధాపురం గ్రామంలోని దొమ్మరి వీధికి వచ్చారు. అక్కడ మేకల సుమంత్ (మహేష్ కుమారుడు) అనే యువకుడిపై దాడికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు ముస్కు ఉదయ్ అలియాస్ మోడెం రాకేష్, కొక్కిస క్రాంతి, వంగ రామకృష్ణలు అక్కడికి చేరుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించారు.

రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి

ఈ క్రమంలో విదేశీ విద్యార్థులు రాళ్లు, కర్రలతో గ్రామస్థులపై దాడికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో వారు విసిరిన రాయి ఫిర్యాదుదారు అక్క ముస్కు రాజమణి కుమారుడు ముస్కు రాజేష్ తలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో బాధితుడిని వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మెరుగైన వైద్యం కోసం వేద ఆసుపత్రికి తరలింపు

ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అనంతరం బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం వేద (VEDA) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజేష్ తీవ్ర తల గాయంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

కేసు నమోదు.. చట్టపరమైన చర్యలు

బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి చెందిన విదేశీ విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.