సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్సై జక్కుల పరమేశ్వర్
ప్రజావాణి శాయంపేట
మండల కేంద్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా శాయంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో “సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “ఆగండి –ఆలోచించండి – అడుగువేయండి” అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు, యువతకు సైబర్ మోసాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ వివరాలు, ఓటీపీ నంబర్లు చెప్పకూడదని, యువత ఆన్లైన్ గేమింగ్ మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని హెచ్చరించారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో మోసగాళ్లు అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న “డిజిటల్ అరెస్ట్” అనే విధానం చట్టంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడితే ఏమాత్రం భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్లోగా జాతీయ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సైబర్ వారియర్స్, పోలీస్ సిబ్బందితో పాటు గ్రామస్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.